Nov 29, 2014

హాం... ఫట్ !


శ్రీ పసల భీమన్న గారు పంతుళ్ళకు పంతులు గారు!
మాట వరసకు అనడం లేదు. వారు , బిఇడి కళాశాలల్లో పని జేసి, జిల్లా విద్యాశాఖాధికారిగా  పదవీ విరమణ చేశారు. ఇక, వారి ఊపిరి మానవవాదం. హేతువాద ఉద్యమం తోనూ ఆయా వేళల కళ్లు తెరిచిన వివిధ సామాజిక ఉద్యమాలతోనూ వారికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. భావ విప్లవ ప్రచారం ధ్యేయంగా వారు అనేక వ్యాసాలు, కథలు వ్రాశారు.
అన్ని చోట్లా, పిల్లలు బడులు ,పంతుళ్ళు ఆయన అభిమాన విషయాలు. అయితే, వారికి అన్నిటికన్న ఇష్టమైన పని మరొకటి ఉంది.
శ్రీ ప్రేమానంద్ గారు గూడవల్లిలో మూడు రోజుల పాటు నిర్వహించిన , మహిమల గుట్టురట్టుచెసే ఇంద్రజాల ప్రదర్షన లో నేర్చుకొన్న మహిమలని చేసి చూపించడం. ఆ ఇంద్ర జాలం వెనుక ఉన్న రహస్యాల్ని వివరించడం. వారు ఎక్కువగ  పిల్లలతో పనిచేస్తారు కాబట్టి, పిల్లలకు ఇష్టమైన కొన్ని సరదా ఇంద్రజాలాలు ప్రదర్షిస్తూ , మహిమలను బట్టబయలు చేస్తారు.
 ఈ నడుమ, మా బుజ్జి బడిలోనూ వారు ఈ ప్రదర్షన నిర్వహించారు.
మా పిల్లలా చిన్నిపిల్లలు. అయినా, భీమన్న గారు ఇట్టే జట్టు కట్టేసారు. పిల్లలకోసం పిల్లలకు నచ్చిన ఇంద్రజాలాన్ని ప్రదర్షించారు.ఖాళీ డబ్బాలోంచి తీపి బిస్కట్టులు రావడం, ఖాళీ సంచిలోంచి పూలగుత్తులు రావడం ..లాంటివి .
 పిల్లలు  "కోరినప్పుడు కురిసే వాన" లాంటి కిటుకులెన్నో నేర్చుకొన్నారు.
ఆ మరునాడు మా సుశ్రుత్  , ఖాళీ పలక చూపించి మ్యాజిక్ చేస్తానని  , 
అబ్రకదబ్రా అంటూ.. చూపుడు వేలితో.  పలక చుట్టూ సున్నాలు చుట్టి, , పలకని గిర్రున తిప్పేసాడు.
తిరగేసిన పలక మీద,  
ముందే రాసి ఉంచిన గుండు సున్నాని చూపించాడు !
ఇక మేమేం చేస్తాం?
చక చక చప్పట్లు కొట్టాం !
****
ఇంతకీ, అందరిలోకి చిన్నవారెవరూ?
 భీమన్న గారే!
మా బుజ్జిపిల్లలన్నా మధ్యలో ఆటవిడుపు తీసుకొన్నారు కానీ, వారి కప్పుమంచి నీళ్ళయినా
 తీసుకోలేదు.కాసేపు  విరామం ప్రకటించి, బలవంతంగా ఓ కప్పు తేనీరు ఇవ్వవలసి వచ్చింది.
 డెబ్భై ఏళ్ళు దాటబోతోన్నప్పటికీ, ఆయనకు అలుపుసొలుపు లేకుండా చేసింది...
 పిల్లల పట్ల ఉన్న అభిమానమూ, ఆయన చేస్తోన్న పని పట్ల ప్రేమ,నమ్మిన భావాల పట్ల అంతులేని విశ్వాసం ! 
పిల్లలతో పనిచేసే వారు పసితనాన్ని వసివాడనివ్వరు అన్న మాటకు భీమన్న గారు ఒక నిలువెత్తు ఉదాహరణ. 
వారిని ఇంకా  కలవని పిల్లలూ, త్వరగా కలుసుకోండి.
బోలెడన్ని  ఇంద్రజాల మెళుకువలనీ, మహిమల ఆంతర్యాలనీ తెలుసుకోండి. !
వారెంతో ఇష్టంగా , మీతో ఆ రహస్యాలన్నీ పంచుకొంటారు.
 బోలెడంత సరదాగా.
హాం... ఫట్ ! 
***


All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

No comments:

Post a Comment