Oct 7, 2014

కానీ, పళ్ళెంలోకి ... ?

ఇవ్వాళ సాయంత్రం. పిల్లలు గూళ్ళకు చేరుకొనే వేళ. 
ఇంకా బడిలోనే ఉన్నాం. రేపటి పాఠాల తయారిలో. 
శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి పలకరింపు. 
అశ్చ్యర్యంగా.
ఆవేదనతో.
" నిన్నటి ఉదయం రేగడి విత్తులు మళ్ళీ చదవడం మొదలు పెట్టాను. పూర్తయింది. నీతో మట్లాడాలనిపించింది. " అంటూ.. "తెనాలి దగ్గర మాకు తాతలనాటి పొలం ఉండేది. ఒక రైతు మా వద్ద కొనుక్కొన్నాడు.ఈ మధ్య ఆ దారిన వస్తూ , ఆ మట్టి మీద ఆప్యాయతతో.. ఆ రైతు క్షేమసమాచారాలు అడుగుదామని ఆగాం. ఆ పొలం సాగుచేస్తున్నట్లుగా లేదు. రైతన్న కష్టాలేమిటోనని పరామర్షించాం.
"ఎకరం పదిహెను నుంచి పాతిక లక్షలు చేస్తుందండి. సాగు చేస్తే,
పొలం బిగువుండదని బిల్డర్లు కొనరండి .. అందుకనే పంటేయకుండా బేరసారాలు చూత్తన్నామండి! " అన్నారట. 

సుబ్బరామయ్య గారు చాలా సేపు బాధ పడ్డారు.. 
"బహుళ అంతస్తుల భవనాలు వరుసలు వరుసలుగా వస్తాయమ్మా... కానీ, పళ్ళెంలోకి అన్నం ?" 
వారి గొంతులో తొణికిన ఆర్ద్రతకు నేనేమీ మాట్లాడలేక పోయాను.
" రేగడివిత్తుల ముందుమాటలో నీవు లేవనెత్తిన మౌలిక ప్రశ్నలకు ఇక సమాధానం దొరకదమ్మా.." 
అంటూ చాలా సేపు బాధ పడ్డారు. 
వారికి నేనేం బదులివ్వగలను ? 
మౌనంగా వారి ఆవేదనను పంచుకోవడం తప్ప ! ప్చ్!
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

No comments:

Post a Comment