Sep 9, 2014

పిల్లకారు పల్లెకారులతో ఒక పూట !

చాలా కాలం గా అనుకుంటున్నా,
అనుకోకుండా కుదిరిందీ శనివారం.

పాత్రికేయులు శ్రీధర్ గారు,శ్రీమతి మంజుల గారు,
 గ్రంథాలయనిర్వాహకులు శ్రీమతి కాంతమ్మ గారు,
పొదుపుసంఘాల ప్రతినిధి శ్రీమతి జ్యోతి గారు,
నవ్య, సునీక్ష (బుడిగి) ....
మమ్మల్ని నేరుగా,


ఉప్పు పొలాల్లోకి తీసుకు వెళ్ళారు.    ఉప్పు పంట కాలం ఇదీ.


దారికి ఒక వైపు ,పండిన వరిచేలు . మరోవైపు ఉప్పు పంటల గుట్టలు.
చూడ  ముచ్చటగా ఉన్నది.  తీర్చి దిద్దిన చిత్రపటం లాగా.
గడ్డికప్పి భద్రం చేసిన ఉప్పుగుడిసెలని చూస్తుంటే,
మా చిన్నతనాన వాకిళ్ళలో కళకళలాడిన  ధాన్యం పురులు జ్ఞాపకం వచ్చాయి.

దోసిట్లోకి ఉప్పుని తీసుకొని ,దండి మార్చ్ చేసినంత సంబర పడ్డాం.
చేతులు ఊర్కోవుగా, నోట్లోను వేసుకొని చప్పరించి చూసాం.
వానలు మొదయితే ,ఈ పొలలన్నీ జలమయం అవుతాయి.
బహుశా ఇది ఈ ఏడాది ఆఖరు ఉప్పు పంట కావచ్చు.
తూర్పుగాలి పోసుకొంటూ, ఉప్పుమళ్ళలో తిరుగాడాం.
ఉప్పు గుట్టలెక్కి జారుడు బండలాడాం. 
మంచుకొండలెక్కినంత సంబరంగా .
ముచ్చటపడి ఫోటోలు తీసుకొన్నాం. 
పోటీలు పడి గుప్పిళ్ళ నిండా ఉప్పుని పోగుచేసుకొన్నాం. 


వానలు మొదలయ్యేలోగా ఉప్పును తరలించే పనిలో ఉన్నారు. ఉప్పురైతులు.
అక్కడే బ్రిటిష్ కాలం కట్టిన " ఉప్పు బంగళా" , ఉప్పు పంట అధికార ఆఫిసు ,ఇంకా తన విధినిర్వహణలోనే మునిగి ఉన్నది!
దండి మార్చ్ గుర్తుకు రావడం యధాలపంగా నైనా, అక్కడే ఆనాటి ఉప్పు సుంకాల కేంద్రాన్ని చూడడం చారిత్రక జ్ఞాపకం!


పాళ్యానికన్నా ముందు బడి పలకరించింది.
పిల్లల కోసం బంక మన్నుతో స్వయంగా తయారు చేసుకొన్న, నమూనా  విసుర్రాయి ,రోలు , పచ్చడిబండారు ,ఏనుగు , కోతి..ఇలాంటివన్నీ. సంబరంగా చూపించారు , ఉపాధ్యాయిని శ్రీమతి శేషమ్మ గారు , వారికి తోడుగా ఉన్న సహాయకురాలు.




పాళ్యం లో అమ్మలంతా గుండ్రంగా చేరి "గుండీల ఆట"లో మునిగి ఉంటే, నాన్నలంతా,
మరో వలయంలో కూర్చుని"పులి జూదం"లో నిమగ్నమై ఉన్నారు.
పిల్లలేమో , మధ్యాహ్నం అన్నానికీ సాయంత్రం గుగ్గిళ్ళు వడియాలకీ మధ్యన ,
అక్కడ ఉన్నఒకేఒక పంతులమ్మకి చిక్కకుండా దొరకకుండా పరుగులు తీస్తున్నారు.


బడి దగ్గర ఎవరో గోరింటాకు పెడతన్నారంట ... గుప్పుమంది వార్త మా చుట్టూ ...మేమక్కడ నిలబడి ఉండగానే.









***

మమ్మల్ని చూసిన వేళావిశేషం, గుగ్గిళ్ళ మాట మరిచి, వడియాల వేళ దాకా ఆగకుండా మరీ,
మా దగ్గరకు వచ్చేసారీ పిల్లకారు పల్లెకారులు!
ఇక, పాళ్యం పిల్లలతో రంగుల భేటీ.
మేమిచ్చిన కాగితాలపై రంగుల మబ్బులను, అలల కడలిని, చేపల ఈతలను, పచ్చని పొలాలను, నెమలి ఆటను..వేస్తూ చూస్తూ పకపక లాడారు.
వారి బొమ్మలు వారికిచ్చేసాం. కొన్ని పాటలు ఆటలతో పాటుగా.
కొన్ని రంగులు, కాగితాలు కుంచెలు. ఆటలు పాటలు నవ్వులు . బొమ్మలు.రంగులు .

ఇక, పైడేరు మొన్న వరదల్లో , దారి మళ్ళిందిట.
సముద్రాన్ని పాళ్యాన్ని దూరం చేసింది. నిండుగా పారుతున్న పైడెరు.
సముద్రపు  నీరు కలగలసి తిరిగి సముద్రంలోకి వంపులు తిరుగుతూ పారుతున్న వయ్యారం చూడవలసిందే.
పట్టపోళ్ళ పడవలో పైడేరుపాయను దాటుతోంటే, దారి తప్పి ఏ విశ్వనాథ సినిమా లొకేషన్లోకో వెళ్ళిపోయామనిపించింది కాసేపు.
 కానీ , అది ఇసుకపాళ్యెం తీరప్రాంతమే!

"ఈ రోజు ఇంత త్వరగా ఎలా సాగిపోయిందో" అనుకొంటూ ,
పండిన పొలాలమీదుగా, తిరుగు ప్రయాణం.
సముద్రం గాలితో పాటు పిల్లల జ్ఞాపకాలని వెంటతీసుకొని.

***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

No comments:

Post a Comment