Feb 19, 2011

రేగడి విత్తులకు ముడిసరుకు

నిజమే.
మా వంటి  రైతు కుటుంబాలలో పుట్టిన ఆడపిల్లలు , ఎప్పుడో పూజకో పునస్కారానికో తప్ప పొలం గట్టు తొక్కరు.
రైతుల ఇంటి ఆడవాళ్ళు పాడికే పరిమితం. పంటలో వారు పాలు పంచుకోవడం అరుదు.
దొడ్లో కూరపాదులు పెంచడమో, దడులమీద బీర తీగలు పాకించడమో తప్ప ,  పంటపండించడంలో భాగం లేదు.
గడప దాటడమే గగనమైన వారికి ,పొలానికి వెళ్ళడం అన్న ఆలోచనే ఉండదు.
మరి నాకు పొలం గురించి హలం గురించి, తెలియదనుకోవడం సహజమే.
నేను రాసిన అడపాదడపా రచనలలో , ఎక్కడిక్కడ కనబడే సేద్యం పనులన్నీ రాయగలిగానంటే
నేను అలా పొలాల్లోకి వెళ్ళగలగడం వల్లనే. చేలగట్ల మీద.. పంటచాళ్ళలో గెంతులేస్తూ పెరగడం మూలానే.
నన్ను పొలాల్లోకి  తీసుకెళ్ళింది పెదనాన్న, శ్రీ కోటపాటి కోటేశ్వరరావు గారు.
ఒక రకం గా చెప్పాలంటే
పెదనాన్న గారి ముదిగారమే నా రేగడి విత్తులకు ముడిసరుకు.
పెదనాన్న గారికి  ముగ్గురూ అబ్బాయిలే.  వారి పెద్దమనవడు నేను ఒకే ఈడు వారం.
పెదనాన్నగారు నన్ను పసితనం నుంచి చేరదీసారు. వారి అమ్మ ,మా నాయనమ్మ , చంద్రమ్మ  గారి పేరు నాకు  పెట్టారు. అందుచేత నేనంటే మరీ గారాబం.
ఆయన గొంతు సవరించుకొంటే , ఇంటి ఆడవాళ్ళు లోపలి గదుల్లోకి పరుగులు పెట్టే రోజులవి.
నన్ను మాత్రం, భుజాన మోస్తూ తను ఎక్కడకి వెళితే అక్కడికి తీసుకు వెళుతూ ఉండేవారు.
 మా దడి దగ్గర పెదనాన్న నాటిన సీమతుమ్మచెట్టు మీది పిచ్చుక కిలకిలతో నిద్ర లేచి, వేపపుల్లను నోట్లో నములుతూ పెదనాన్నను గమనిస్తూ ఉండేదాని.
కళ్ళాపికి కావిళ్ళు మోయడం దగ్గర నుంచి, దూడలను వదలడం ,పాలను పితకడం, పాలకేంద్రానికి వెళ్ళడం , పొలాలకు ఎడ్లను సిద్ధం చేయడం, పైటేళకి భోజనం తీసుకొని ,పొలానికి వెళ్లడం ..వరకు వెంటెంటే తిరిగేదాన్ని.
నన్ను మాత్రం, భుజాన మోస్తూ తను ఎక్కడకి వెళితే అక్కడికి తీసుకు వెళుతూ ఉండేవారు
కళ్ళాపికి కావిళ్ళు మోయడం దగ్గర నుంచి, దూడలను వదలడం ,పాలను పితకడం, పాలకేంద్రానికి వెళ్ళడం , పొలాలకు ఎడ్లను సిద్ధం చేయడం, పైటేళకి భోజనం తీసుకొని ,పొలానికి వెళ్లడం ..వరకు వెంటెంటే తిరిగేదాన్ని.
ఆయనే వెంట బెట్టుకు వెళ్ళే వారు.గట్టు మీద కూర్చుని పిల్లకాలువలో కాళ్ళు తడుపుకొంటూ ఆయన కబుర్లు వింటూ ఉండే దానిని.  
పెదనాన్న ఊరి దగ్గరి అయిదెకరాల చేలోనో ఆరుదడిచేలో ఉంటే, పూట
 మూడింటికి ఆమ్మ (పెద్దమ్మ) ఫ్లాస్కులో కాఫీ, తపాలచెక్కలు ఇచ్చి పంపేది. ఒక్క దాన్నే వెళ్ళే దాన్ని.
అలా నారుమడులు వేయడం నుంచి ,పాతరలు వేయడం దాకా , పాలు పితకడం నుంచి  వట్టి కొట్టడం దాకా , కుప్పనూర్వడం నుంచి పురి కట్టడం దాకా ..కలుపు తీయడం నుంచి కంచెలేయడం దాకా ఆయనతో పాటు నాకు జీవితంలో భాగాలయ్యాయి
ట్రాక్టర్లు వొచ్చినా,అవి అన్నయ్యలు నడిపేవారు. దూరాన పొలాకి వెళ్లి పోయే వారు
పెదనాన్న గారు ఎడ్లను నమ్ముకొన్నారు. నాగలి దున్నే దుక్కులు  చేసేవారు బండి మీదే పంటను ఇంటికి తోలేవారు.ఇక , పత్తి పంట వొచ్చాక , బోరాలు తొక్కడం ..వంటి వాటిలోను ఆయనే ముందు.
ఇక,నారను తాళ్ళగా పేని , మాకూ ఉయ్యాలలు వేసి కాని ఊరుకొనే వారు కారు.
అన్నెందుకు,
మబ్బు చూసి మట్టి చూసి పంట ఆసుపాసులు నేర్పింది పెదనాన్నే
మట్టిని చెట్టును గొడ్డుగోదను ప్రేమించడం నేర్పింది పెదనాన్నే
ఇవాళ నాగలిపట్టక పోయినా ,  నాలుగు ముక్కలు పంటల గురించి మీతో పంచుకోగలిగానంటే, రైతుల ఇంటి ఆడబడచునైనా, నన్ను తలవాకిటే కాక , రచ్చబండలోను,పొలం గట్టున , చెరువు పక్కన , నా చేయి పట్టుకొని ,తన వెంటతీసుకు వెళ్ళిన పెదనాన్న వల్లే.
నడుం వంచి బంగారు పంటలు పండించే రైతుమహిళలు "నారాయణమ్మ", నాట్లు వేస్తూ పాటలు పాడే బుజ్జమ్మ  ,వడిసెల కొట్టి పిట్టలను తరిమే వారితో స్నేహం అప్పుడే కలిసింది..
మాటలు,పలుకుబళ్ళు, వేళాకోళాలు., పండగలు పబ్బాలు,మంచి చెడు.. అన్నీ ఆయన నాకు చెప్పిన ముచ్చట్లే.
అన్నెందుకు, ఆయనను మీరు చూసారు .
వర్ధని లో కోటయ్య , రేగడి విత్తులలో రత్తయ్య, అగ్గువ లో టమోటా రైతు పాత్రలకు ఆయనే స్పూర్తి.
చెయ్యెత్తు మనిషి.గంభీరమైన కంఠం. నీరుకావి పంచ ఎగగట్టి , తలకు పాగా చుట్టి , ఎప్పుడూ చెమటోడ్చడం తప్ప మరోటి  తెలియదు. ఎనిమిదో తరగతి చదివినా,  హిందీ ప్రాధమిక నేర్చారు.
 మనతో మాట్లాడి నట్లే పశువులతో మాట్లాడే వారు. ఒక సారి ఒక దూడ తల్లి ని కోల్పోయింది. దానిని ఆయన ఒక పసిబిడ్డను పెంచినట్లు ,సీసాలతో పాలు పట్టి పెంచారు. దడి కట్టినా ఇంటి కప్పులు మార్హినా పందిరి వేసినా.. ఎంతటి నైపుణ్యమో.
ఎంత మంది మనుషుల్ని నాకు పరిచయం చేసారో.ఎన్నెన్ని విశేషాలు చెప్పారో.
అవన్నీ ఇంక నాలో పచ్చగానే ఉన్నాయి. ఇంతా చేసి అప్పుడు నా వయస్సు ఎంతని!
నాకు అవన్నీ ఎందుకు చెప్పేవారో తెలియదు.


మాటలో నడకలో ఉచ్ఛారణ లో మర్యాదలో  దుస్తుల్లో మాత్రం పొరపాటు దొర్లకూడదు
ప్రవర్తన విషయంలో ఆయన చాలా ఖచ్చితంగా వ్యవహరించేవారు. ఒక విధంగా  ,ఆయన puritan. .శుద్ధ సంస్కారి.


పదహారేళ్ళకు  నా పెళ్ళయ్యే వరకు
నన్ను మాత్రం  తలవాకిట తన పక్కనే కూర్చోబెట్టుకొనే వారు
అక్కడ ఎవరున్నా
అలా, మగ వారి సంభాషణల్లో చర్చల్లొ నేను పరోక్షంగా మౌనంగా భాగస్వామినయ్యా.
ఇంట్లో మరెవరికీ లేని అవకాశం నాకు, పెదనాన్న గారి గారాబం వలను , వారి అమ్మపై వారికున్న మమకారం వల్ల నాకిచ్చిన చనువు వల్లను లభించింది.


"పడుకొనే ముందు అందరూ ఏడుకొండలవాడా అనో  నారాయణా అనో  అనుకొంటే ,ఆయన  “చంద్రమ్మాఅంటారని మా  ఆమ్మ ( పెద్దమ్మ ) ఎప్పుడు ఆటపట్టించేది


పండిన మిరపచేలు, పసుపు పంట, పిల్లిమెసర , మాగిన టమోటాలు, విరగకాసిన కూరగాయల మళ్ళు, ఉల్లిపాయ పంట ,వేరుశనగ .. ఒక్కటేమిటి అన్నిటినీ  ,స్వయంగా దుక్కిదున్ని పండించి ,పురి కట్టినంతగా,పంటపనుల్లో భాగస్వామిని కాగలిగాఅదీ  పెదనాన్న వల్లనే.
 రైతుతత్వం,పౌరుషం కాస్త అర్ధమయ్యిందంటే , అదీ ఆయన వల్లనే


ఎక్కడున్నా జున్నుపాలు నాకు పంపాల్సిందే.
ఇప్పట్లా అప్పుడు సౌకర్యాలు లేవు కదా? అలా పంపలేక పోయినపుడు ఆయనెంత బాధ పడే వారో.
మేము పాలమూరు చదువులకని వెళ్ళినా ఎప్పుడెప్పుడు సెలవలు దొరికితే అపుడు పరిగెత్తుకుని పెదనాన్న దగ్గరకు వెళ్ళమంటే వెళ్ళనా మరి?
పట్నం గాలి అసలు నావంటికి పడితేగా?
*
కాస్తాగవమ్మా అన్నా ఆగకుండా..
తన పాటికి తాను..
కాలం ఎలా చరచరా బిరబిరా సాగి పోతుంది కదా!
చూస్తూ చూస్తూ ఉండగానే పద్నాలుగేళ్ళు కాలంలో నిశ్శబ్దంగా కలిసి పోయాయి. 


సరిగ్గా ఇలాంటి ఫిబ్రవరి నెలలోనే
రేగడి విత్తులు చివరి అధ్యాయం రాస్తున్నా.
అన్నయ్య దగ్గర నుంచి ఫోను
పెదనాన్నగారిని ఊపిరి యంత్రం పై  నా కొరకై ఆపి ఉంచామని.
నేను వెళ్ళగానే ఇంటికి తీసుకెళ్ళడమే నని.
అప్పటికే నాలుగేళ్ళుగా మంచాన ఆకారమై ఉన్నారాయన. పూట పరిస్థితి చేదాటి పోయింది.
నేను డొంకల్లో పడి. అడవిదారిన వూరికి చేరేటప్పటికి ,
ఆయనను ఇంటికి తీసుకెళ్ళ వలసి వచ్చింది.
అదే ఆఖరి చూపు.
అక్కడికి చేరుకున్న ఆఖరి మనిషినీ ...
నేనే.
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

6 comments:

  1. Vittulone vishva sowbhagyam vundani nammina Kotapati Murahari rao gariki Regadi vittulu ankitam Ichharu !!!!????

    ReplyDelete
  2. అవును.
    అందులో సంభ్రమం ,సందేహం ఏమీ లేవు!
    అన్నట్లు,
    చక్కగా మీ పేరుతోనే ఆ ప్రశ్న అడగొచ్చు మిత్రమా!

    ReplyDelete
  3. 'రేగడి విత్తులు' కి ముందుమాటలో పెదనాన్నగారితో మీ అనుబంధాన్ని ఏబీకే గారు రేఖామాత్రంగా స్పృశించారు. ఇప్పుడు మీద్వారానే తెలుగుకోగలగడం మాటల్లో చెప్పలేని అనుభూతి. కొన్ని అనుబంధాలని అక్షరాల్లోకి తర్జుమా చేయడం అంత సులభమైన పనేమీ కాదు.. మనకి తెలిసిన భాష మనల్ని చూసి నవ్వే సందర్భాలు కదూ అవి... మీరు ఎంతో రాయాలని మొదలు పెట్టి ఈ టపా రాశారని అనిపించింది నాకు.. అసందర్భమైనా ఒక ప్రశ్న.. ఇది చదివాక 'వర్ధని' లో వర్ధనికి, మీ బాల్యం గడిచిన తీరుకీ కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి.. ఉన్నాయంటారా?

    ReplyDelete
  4. మురళి గారు,
    నమస్కారం.

    వర్ధని నవల ప్రధానంగా , పిల్లల గురించి.
    Sibling Rivalry,Separation anxiety, తదితర సున్నితాంశాలను రాయాలనుకొన్నా. ఆ నేపధ్యంతో , పిల్లల మనస్తత్వశాస్త్రం లో కొంత అధ్యయనం చేశా.
    నాకు తెలిసిన లోకం నుంచే కథ,కథనం, నేపధ్యం అంతా.
    అయితే, నేను ఏ ఉద్దేశంతో రాశానో ఆ పిల్లల మనసతత్వం అటుంచి , అందులోని నేపధ్యమైన ,పల్లె వాతావరణం, నలుగురి దృష్టికీ వచ్చింది.
    మధురాంతకం గారన్నారు, "రాయలసీమ తెలంగాణా నడుమ ఇంత అందమైన పల్లెటూళ్ళున్నాయా?" అని.
    ఉన్నాయండి .అలాంటి ఒక పల్లెలోనే నేను పుట్టి పెరిగాను.
    అంతే కాదు, వర్ధని, మా వూరి గురించి నేను రాసుకోవచ్చన్న ధైర్యాన్నిచ్చింది.
    ఇంకేం!
    అది, రేగడివిత్తులుగా మీ ముందుంచాను.

    నిజమే ,వర్ధనంత గారాబంగా పెంచారు.
    కానీ,sibling rivalry లేదు. పెదనాన్న గారి హయాం వరకు , నన్ను అలాగే గారాబం చేశారు. ఇంట్లో అందరు దానికి బద్దులై ఉన్నారు.:-)

    ReplyDelete
  5. Chanlata garu
    namaskaram
    regadivittula gurincchi miru ippudu raasina modati vaakhyam tiru chuste edo,evvariko vivara ivvalannatlu anipinchindi.Emaina malli nannu mi pai lekha ekkadiko avyaktha madhuraanubhutulloki tisukusvelli,chaduvutunte
    kalla nilla paryantamai edo cheppaleni udvegani lonayyanu.konni kshanalu ankallanillavalana chadavalekapoyanu raayalekapoyanu.Nenu naa aravai ella vayasulo enno telugu navalalu chadivaanu kaani mi navalalloni srujanatmakata,vaastavikatalu raayalante bashaa daaridryam nannu pindestondi.Intakante raayalekapotunnanu

    burugupalli paparao

    ReplyDelete
  6. ధన్యవాదాలండి.

    ReplyDelete