Jun 9, 2010

విడివడ్డ పురికొస ముడి

ఎప్పుడూ ఇంతే.
ఎదురు చూసినంత సేపు పట్టదు కదా..
ఎండాకాలం సెలవలు అయిపోవడానికి!
మొన్నటి దాకా ..
సెలవల్లో ఏం  చేయాలన్న సవాలక్ష  సమాలోచనలు.
నిన్నటిదాకా..
సెలవలు ఎలా గడపాలన్న పదిన్నర పథకాలు.
పూటో మర్నాడో ..
సెలవలు ఇక లేవంటూ మిగిలే ఒకే ఒక్క దిగులు.
పిల్లల సంగతి అటుంచండి.
టీవీలు, పియస్ త్రీలు, కంప్యూటర్ ఆటలు ,ఆర్కూటులు,ఫేసుబుక్కులు,చాటింగులు..వాళ్ళవేవో వాళ్ళకున్నాయి.
పెద్దాళ్లతోనేగా అసలు సంగతి.
సెలవలు వస్తాయన్న సూచన రాగానే ..సెలవల్లో ఈ పిల్లలని ఎలా సరి దిద్దేయడమా ..ఈ సెలవలు అయిపోయేలోగా ఈ పిల్లల్ని ఎలా తీర్చి దిద్దుదామా ..ఎంత బాగా మణి మాణిక్యాల్లా మలిచివేద్దామా ..ఇలా అలా..
తలకు తట్టెడు ఆలోచనలు.
అమ్మానాన్న లకు అంత ఆలోచించే శ్రమ ఎందుకనో ఏమో..
బోలెడన్ని బడులు వేసంకాలం మధ్య వరకూ సాగి, ఏరువాక సాగక ముందే భళ్ళున తెరుచుకుంటాయి.
ఏ మాట కా మాట చెప్పుకోవాలి.
మునుపటి కన్నా ఇప్పుడు వేసంకాలంలో వెసులుబాట్లు ఎక్కువ.
ప్రయివేట్లు ,ఎంసిట్టింగ్లు తరహా వేసవి శిక్షణా శిబిరాలు ,సినిమాలుసిత్రాలు,కుటుంబప్రయాణాలు ,దేశసంచారాలు ఇప్పుడు కావలిసినన్ని.
వేసంకాలం కోచింగులు క్యాచింగులు ..కోరుకున్న వారికి కోరుకున్నంత.
ఏటి దగ్గరి ఊరన్న మాటే గానీ ,కాలువ గట్టు బతుకులయ్యే .కాలవ ఆగిందా ..ఎండాకాలం సెలవలు వచ్చినట్లే లెక్క.
అటు ధాన్యం ఇటు దాణా ...అన్నీ ప్రియమయి కూర్చుంటాయి. నీటి సంగతి సరేసరి.
మనుషుల అతీగతీ  పట్టించుకొనే నాథుడుండుండు.పశువుల సంగతి అడక్కరలేదు.
పిడికెడు పరక కోసం ముట్టెలాంచి రేగడంతా వెతుకుతూనే ఉండేవి.
ఏట్లోనే నీరు బొటబొటలాడుతుంటే కాలువ నెర్రెలు బారదా? ఇక ఉన్న ఒక్కగానొక్క చెరువు సంగతి చెప్పక్కర లేదు.
ఉన్నకాసిని నీళ్ళు ఆవిరయ్యే లోపుగా చేపలుపట్టే వాళ్ళు తయారు.
పట్టిన చేప పట్టగా ఒట్టిపోయిన చెరువు గట్టు దాటి.... గాట్టి బురదలో తొక్కుకొంటూ వెళ్ళి జనుం కోసుకొనే వాళ్ళు కొసుకొన్నారా ..ఇళ్ళ కప్పులు కప్పుకొనే వారు కప్పుకొన్నారా..ఇక ,చెరువులో మిగిలిన కొద్దిపాటి   బురద నీళ్ళలో పట్టిన నాచుపాచిల నడుమ బుడుంగు మంటూ .. ఏ కప్పో చేపో బురద మట్టో... అప్పుడప్పుడు ..విప్పారి ముసి ముసి నవ్వులు నవ్వే కలువపూలో ..కళకళలాడుతూ విరిసే  తామర పూవో.
అలాంటి ఎండాకాలం సెలవుల్లోనేగా..
బ్యాటరీలు అవజేస్తారని చీవాట్లు తింటూ.. క్రమం తప్పకుండా బాలానందం విన్నదీ.
కనులు తిప్పకుండా అన్నానికి లేవకుండా అప్పచ్చులు అడగకుండా ... అన్నాకెరీనానాను  పలకరించిందీ స్పార్టకస్ ను పరామర్షించిందీ.
చిట్టిమేఘమైనా లేని ఒట్టి ఆకాశంలో ..లెక్కలేనన్ని చుక్కల్ని చూసిందీ.. వడగాడ్పుల్లో మాడిమసవుతున్న చెట్టుచేమల్ని చూసిందీ ..సుడిగాలుల్లో తేలిపోతున్న ఇళ్ళకప్పుల్నీ, పెళపేళలాడే ఉరుముల్నీ ,నేలను చీల్చేస్తాయే అనిపించే మెరుపుల్నీ.. వడగళ్ళవాన్నల్లో తడిచి పోతున్న గడ్డివాముల్ని. పెళ్ళున విరిసే హరివిల్లుల్నీ
 ..చూసింది.
పెద్దాళ్లంతా చదివి,పురికొసతో ముడేసి, అటకెక్కించిన యువ,జ్యోతి,స్వాతి ,ప్రభలూ.... వెతికి పట్టుకొని చదవ ప్రయత్నించిందీ...
వడ్డాదిపాపయ్య గారి బొమ్మల సుకుమార్యంలో లేతరంగుల ప్రపంచంలో విహరించిందీ..బాపుబొమ్మల కొంటెతనం పరిచయం అయిందీ ..
అవి మధుబాబు తరహా డిటెక్టివ్ లైనా  , పాకెట్టు జానపద నవలల విక్రమబేతాళైనా..చంద్రకాంత  శిలలనూ   తుపాకీ రహస్యాలనూ ..ఒకా పట్టున చదివిందీ..
ఏం అర్ధమయిందని సొమ్ములు పోనాయండీ చవడం? అనుక్షణికం ,చెంఘిజ్ ఖాన్...ఏం అవగాహన అయ్యాయనీ?కరప్పూస పటుకు పటుకు మంటూ.. పెద్దలు వద్దన్నవి ప్రతి పేజీ పదే పదే ..చదవడం తప్ప!పరీక్షకు చదవనంత శ్రద్ధగా!
ఏ పురినీడలోనో బోరాల చాటునో నులక మంచం వాల్చుకొనో.. చూరు నీడపొడలో ఒదిగి కూర్చునో . పాతకెరటాలను తాకి వచ్చిందీ ఎండాకాలం సెలవల్లోనే కదా?
అయిదో ఆరో తరగతి సెలవల్లోనో చదివిన "విశ్వ దర్శనం” ఆపై చదివిన నరావతారం" ప్లూటొకాలంలో ఒక్క ఏడాదైనా లేదు కదా ఈ మానవ జీవితం అంటూ కలిగిన వైరాగ్యం..అన్ని జీవుల్లో కెల్లా బుద్ధిజీవై ఉండి ..మనుగడ కోసం.జీవిక కోసం..నరావతారం పడ్డ తపన ..చేసిన ప్రయోగాలు విఫలాలు,ప్రయాణాలు ప్రయత్నాలూ .. బౌతికంగా మానసికంగా మేధోపరంగా  జరిగిన పరిణామ క్రమపు ఆంతర్యం,చేతన, వికాసం   ..సమాజాల్లోని ఏడుతరాలు..అమ్మ ..అసమర్ధుని  జీవయాత్రలు...హకుల్బరీఫిన్లు...చివరికి మిగిలేదీ .. దీ అర్ధమయ్యీ అర్ధమవ్వక ముందే ..తలల్లోకి తలపుల్లోకి ఇంకి పోయినదీ .. ఇలాంటి ఎండాకాలం సెలవుల్లోనేగా!
పిట్టలు కూడా నోళ్ళు తెరుచుకొని ..ఆవురావురంటూ కాలువ నెర్రుల్లో ముక్కులు జొనిపి .నీటిచుక్కలకై వెతుకు తుండగా ..
రాలిన వేప పళ్ళో ..మాగేసిన ఈతకాయలో ..చిగురుకొమ్మనున్న సీమచింతకాయల్నో ..సాధించుకొని ..సావధానంగా తింటూ..
అలంపురం బేనిషాలను మాగేసి.వంతులేసుకొని టెంకెను పంచుకొంటూ.. చీకేసిన టెంకెను ఎండెసి..ఎండెసిన టెంకెను నాటేసి..ఉన్ని కొన్ని నీళ్ళు చిలకరించి..ఆకాశం వంక ఆశగా చూస్తుండగానే.. ఎండాకాలం సెలవలు అయిపోయేవి !
వడగాడ్పు.సుడిగాలి.ఏరువాక.వడగళ్ళ వాన.తొలకరి.
మళ్ళీ బడి !
 ***
కట్టండి బండి..తెల్లార గట్ట
పాలమూరు ప్రయాణం!


*
వద్దంటే వినకుండా
విడదీసిన  పురికొసముడి ని బిగించి.. అక్కడక్కడా పడిఉన్న పుస్తకాల్ని అటకపై విసిరేసి ... 
ఎద్దుల మువ్వల సవ్వడిలో ఎక్కిళ్ళు దాచేసి ..దిబ్బరొట్టి నములుతూ
..చడీచప్పుడు లేకుండా ..చెన్నుపాడు బస్ స్టాండుకి.. మళ్ళీ బడికి.
*
 మళ్ళీ బడికెళుతున్న పిల్లలకు ,వాళ్ళ అమ్మానాన్నలకూ..అనేక శుభాకాంక్షలు.
***

 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

1 comment:

  1. ఏండాకాలం సెలవుల గురించి యెంత అద్భుతంగా చెప్పారు. చాల బాగుంది. మీరు చదివిన పుస్తకాల గురించి మీ కామెంట్లు అంత చక్కగా వాటి పరిచయము చేసిన రచయతలు కూడా చెప్పి ఉండరు.

    ReplyDelete