Sep 24, 2009

“ పిల్లవాండ్లకు చాలు ”

దశరా పండగొస్తుందంటే చాలు.

మా కిష్టప్పపంతులు ,ఆయన వెనకే మా పిల్లల రామదండూ తయారు.

సన్నటి కర్రొనొక దానిని బాగా వంచేసి పురికొసతో చివర చివర ముడేస్తే చాలు విల్లు తయారు. ఇక బాణాలకు ఏం కొదువ? అన్ని పుల్లలూ చివర్లు చెక్కి సిద్ధం చేసేసుకోవడమే.

తలా ఒక విల్లంబు చేతికి చిక్కినన్ని బాణాలు పట్టుకొని .. పైపంచో కండువానో వల్లె వేసుకొని జోలె కట్టుకొని ఊరంతా తిరుగుతూ... ఒక్కో గడపా ఎక్కీ దిగుతుంటే చూడాలి పిల్లల సరదా.

గొంతు చించుకొని "అయ్య వారికి చాలు అయిదు వరహాలు... పిల్లవాండ్లకు చాలు పప్పుబెల్లాలు " అంటూ పాడుతుంటేనే నోరూరి పోయిది కాదూ ?

పైనుంచి, ప్రతి ఇంట్లోనూ పిండివంటలు.

వండుతూ.. వారుస్తూ.. వాసెనలు కడుతూ. కమ్మటి వాసనలు

పిల్లలు కనబడగానే .. తలో అరిసె ముక్కో తపాలాచెక్కో ..కారప్పూసో బెల్లప్పూసో .. అలా గుప్పిట్లో..పోసేవారు. ఒక మొట్టికాయ వేసి మరీ.

అలాగని తాయీలాలన్నీ ఉత్తిత్తునే ఇచ్చే వారు కాదండీ.. మా చేత ముప్పై నాలుగు పద్యాలు అపజెప్పించుకొని.. శ్లోకాలు ఎక్కాలు ముక్కు బట్టి పిండుకొని.. చెవి నులిమి ..వీపు విమానం మోత మోగించి .. మరీ ఇచ్చే వారు.

పాపం ...మా పంతులు.

తనే ఏదో పేద్ద పరీక్ష రాస్తున్నట్లు!!!

బిక్క చచ్చి పోయే వారు.

మేము ఏం ఘనకార్యం వెలగ బెడతామేమో ననీ.. ఒక బెత్తాం చేతిలో పట్టుక తిరగక తప్పేది కాదు ..వారికి!

అయితే ,కళ్ళురిమినా పళ్ళు పటపటలాడించినా , పూట అదిరేవారు ఎవరు? బెదిరే వారెవరు ?

అంతవరకు బాగానే ఉండేది కాని, ఒక మారు మా కాలువ గట్టు నరసయ్య గారి కొత్తల్లుడు అన్నారు కదా... ఇంకా పాత చింత కాయ పచ్చడి పద్యాలెంటయ్యా పంతులూ ” అని.

ఊరికి అల్లుడయ్యే ఉక్రోషం ఆపుకొని మా పంతులు సమాధానం చెప్పేలోపునే.. మా సరళ, అదేనండీ ఏడాదే కర్నూలు కాన్వెంటులో చేరిందే తను, గడ గడా బి సి డి లు...వన్ టూ బకుల్ మై షూ లు ... అప్ప జెప్పేసింది..!

హమ్మయ్య గండం గట్టెక్కింది అనుకున్నామా... తరువాత చూడాలి మా తిప్పలు.

ఆంగ్ల వాచకం మా బడిలోకి వచ్చి బైఠాయించింది. సరళ మాకు పంతులమ్మ అయి కూర్చుంది.

గోడ కుర్చీలే వేయించిందా ముక్కు చెంపలే వేయించిందా.. అది వేరే విషయం.

పండగ నాలుగు నాళ్ళ ముచ్చటే లెమ్మని మేమూ ఊరుకొన్నామనుకోండి..! ముందుంది ముసళ్ళ పండగ..సరళ సంగతి ఇక చూడాలి! అల్లుడు గారితో పాటూ..!

మా పంతులు ఇంటికి చేరే లొగానే.. బుడబుడ బుక్క మోగింది.

అంతే.. ఎక్కడ పిల్లలు అక్కడ మాయం..! బుడ బుక్కల వాని వెనక తోకల్లా వూరి మీదకు రెండో మారు. ..!!!

అది సరే కాని, ఇది చదివాక మీలో ఎవరికన్నా హాలోవిన్నూ ... ట్రిక్ ఆర్ ట్రీట్ ...గుర్తుకు వచ్చే ఉంటుంది .కదా? పిల్లలు కదా నాలుగు చాక్లెట్లు చేతిలో పెడితే సంబరంగా పోతారు అనుకుంటారేమో..!

మాకు మల్లే ఎవరిదైనా రామ దండు వాకిట్లోకి వచ్చి పప్పు బెల్లాలు పెట్టమంటే .. కసిరి పడేసేరు..!

పిల్లలు కదా వారికేం తెలుసు ?

పప్పుబెల్లాలు ప్రియమైపోయయనీ ..పండగ పూట కూడా ఆచి తూచి వాడుకోవాలనీ..!


All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.

No comments:

Post a Comment